వినికిడి సమస్యలతో ఏటా లక్ష కోట్ల డాలర్ల నష్టం: డబ్ల్యూహెచ్​ వో నివేదిక

02-03-2021 Tue 12:37
  • 2050 నాటికి 25 శాతం మందికి వినికిడి సమస్యలొస్తాయని హెచ్చరిక
  • 2019లో 160 కోట్ల మందికి సమస్యలున్నట్టు వెల్లడి
  • ముప్పై ఏళ్లలో ఆ సంఖ్య 250 కోట్లకు పెరుగుతుందని ఆందోళన
  • నివారణకు ఒక్కొక్కరిపై ఏటా 1.33 డాలర్లు ఖర్చు పెట్టాలని సూచన
  • చెవి నిపుణులకూ సమస్యపై సరైన అవగాహన ఉండడం లేదని వ్యాఖ్య
One In Four People Will Have Hearing Problems By 2050 says WHO report

మరో ముప్పై ఏళ్లలో వినికిడి సమస్యలతో బాధపడే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ప్రస్తుతం ప్రతి ఐదుగురిలో ఒకరికి (20 శాతం) వినికిడి సమస్యలున్నాయని, 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరు (25 శాతం) దాని బారిన పడతారని పేర్కొంది. కాబట్టి ఇప్పటి నుంచే దాని నివారణ, చికిత్స కోసం అదనపు పెట్టుబడులు పెట్టాలని సూచించింది. మంగళవారం వినికిడి సమస్యలపై తొలి అంతర్జాతీయ నివేదికను డబ్ల్యూహెచ్ వో విడుదల చేసింది.

చెవి ఇన్ ఫెక్షన్లు, వివిధ వ్యాధులు, పుట్టుకతో వచ్చే లోపాలు, భారీ శబ్దాలు, జీవనశైలి అలవాట్ల వంటి వాటిని నివారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వినికిడి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏటా ప్రతి ఒక్కరిపైనా 1.33 డాలర్లు ఖర్చు పెట్టాలని సూచించింది. సమస్యకు సరైన పరిష్కారం చూపించకపోవడం వల్ల ఏటా లక్ష కోట్ల డాలర్ల నష్టం జరుగుతోందని పేర్కొంది.

వినికిడి సమస్యలున్న వారు చదువు, ఉద్యోగాలకు దూరమవ్వాల్సిన పరిస్థితి ఉందని, దాని వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతున్నాయని పేర్కొంది. 2019లో 160 కోట్ల మంది చెవి సమస్యల బారిన పడితే.. వచ్చే ముప్పై ఏళ్లలో అది 250 కోట్లకు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

అల్పాదాయ దేశాల్లో చాలా మందికి చికిత్స చేయించుకునే సౌకర్యాలు లేవని, అక్కడ చెవి నిపుణులు చాలా తక్కువని నివేదిక పేర్కొంది. వినికిడి సమస్యలున్న వారిలో దాదాపు 80 శాతం మంది ఆయా దేశాల్లోనే ఉన్నారని వెల్లడించింది. ధనిక దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులున్నాయని నివేదిక పేర్కొంది. చాలా మంది నిపుణులు సమస్యలను గుర్తించలేకపోతున్నారని, దాని నివారణ చర్యలు తెలియడం లేదని నివేదిక పేర్కొంది.