విశాఖలో ఎన్నికల ప్రచారం.. హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన విజయసాయిరెడ్డి

01-03-2021 Mon 15:30
  • విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయసాయి
  • మంత్రి అవంతితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించిన వైనం
  • ట్రాఫిక్ రూల్సును ఉల్లంఘించారంటున్న ప్రతిపక్షాలు   
Vijaya Sai Reddy violates traffic rules

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ విజయాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈరోజు విశాఖ 40వ వార్డు వైసీపీ అభ్యర్థి గుండపు నాగేశ్వరరావు, 63వ వార్డు అభ్యర్థి పిలకా రామ్మోహన్ రెడ్డి తరపున ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్, ఇతర నేతలు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అయితే విజయసాయి, అవంతి శ్రీనివాస్ లతో పాటు వారి వెనుక బైక్ లపై వస్తున్న వారెవరూ హెల్మెట్ ధరించలేదు. దీనిపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించారని మండిపడుతున్నారు. ఏపీలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే రూ. 1000 జరిమానా విధిస్తున్నారని... వీరికి కూడా అదే జరిమానాను విధించాలని డిమాండ్ చేస్తున్నారు.