వచ్చే ఏడాది సంక్రాంతికి పవన్ పిరీడ్ మూవీ

01-03-2021 Mon 09:56
  • క్రిష్ దర్శకత్వంలో పవన్ పిరీడ్ మూవీ 
  • 17వ శతాబ్దం నాటి కాలంలో సాగే కథ
  • వజ్రాలదొంగగా నటిస్తున్న పవన్ కల్యాణ్
  • కథానాయికలుగా నిధి అగర్వాల్, జాక్వెలిన్
Pawan Kalyans period movie releasing for Pongal

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి సినిమాల పండుగ కూడా ఉంటుంది. ప్రేక్షకులు ఆ పండుగ మూడు రోజుల్లో థియేటర్లకు బాగా వస్తారు కాబట్టి, స్టార్ హీరోలు తమ తమ సినిమాలను ఆ సీజన్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఆ సమయంలో రిలీజ్ చేయడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. ఇదే కోవలో వచ్చే సంక్రాంతికి పవన్ కల్యాణ్ సినిమా కూడా ఒకటి విడుదలకానుంది.

ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా తాజాగా ఓ భారీ చారిత్రాత్మక చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. 17వ శతాబ్దం నాటి కాలం నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఇందుకోసం భారీ సెట్స్ కూడా వేసున్నారు. పవన్ నటిస్తున్న 27వ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.

పవన్ కల్యాణ్ వజ్రాలదొంగగా నటిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ని మార్చ్ 11న శివరాత్రి సందర్భంగా ప్రకటించే అవకాశం వుంది.