Mulugu: 21 వరకు మేడారంలో దర్శనాల నిలిపివేత.. భక్తులెవరూ రావొద్దని అధికారుల అభ్యర్థన

  • గత నెల 24న ప్రారంభమైన మినీ జాతర
  • ఆలయ సిబ్బందిలో ఇద్దరికి కరోనా
  • మూడు వారాలపాటు దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటన
Sammakka Saralamma devotees not allowed to visit temple till march 21st

మేడారం మినీ జాతరలో కరోనా కలకలం రేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయ సిబ్బందిలో ఇద్దిరికి కరోనా సోకడంతో 21 రోజులపాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి వరకు భక్తులు ఎవరూ వనదేవతల దర్శనానికి రావొద్దని కోరారు. ఫిబ్రవరి 24న మేడారంలో మినీ జాతర ప్రారంభమైంది. 27వ తేదీ వరకు కొనసాగింది. అయితే, తల్లుల దర్శనానికి నెల రోజుల ముందు నుంచే భక్తుల రాక మొదలైంది. దీంతో ఆలయ సిబ్బందిలో ఇద్దరు రెండు రోజుల క్రితం కరోనా బారినపడ్డారు.

దీంతో భక్తులు, గ్రామ ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మూడు వారాల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్టు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆలయ ఈవో రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతి తెలిపారు. అప్పటి వరకు భక్తులు ఎవరూ అమ్మల దర్శనానికి రావొద్దని అభ్యర్థించారు. నేటి నుంచి ఈ నెల 21 వరకు దర్శనాలను నిలిపివేస్తున్నప్పటికీ ఆలయంలో పూజలు ఉంటాయని తెలిపారు.

More Telugu News