SEC: పురపాలక ఎన్నికల నేపథ్యంలో వార్డు వలంటీర్లపై ఆంక్షలు విధించిన ఎస్ఈసీ

  • ఏపీలో మున్సిపల్ ఎన్నికలు
  • కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ సమావేశం
  • వలంటీర్లపై ఫిర్యాదులు వచ్చాయని వెల్లడి
  • రాజకీయాలకు వలంటీర్లు దూరంగా ఉండాలని వెల్లడి
  • వలంటీర్లకు ఓటరు స్లిప్పుల పంపిణీ అప్పగించొద్దని ఆదేశాలు
 SEC impose measures on volunteers in the wake of Municipal Elections

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఎన్నికల అధికారులతో విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వలంటీర్ల అంశంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం మాట్లాడిందని ఎస్ఈసీ వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లాగే మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ వలంటీర్లపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. రాజకీయ కార్యకలాపాలకు వలంటీర్లు దూరంగా ఉండాలని ఎస్ఈసీ స్పష్టం చేశారు.

స్వేచ్ఛాయుత ఎన్నికలకు వలంటీర్లపై కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రక్రియ నుంచి వలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఓటరు స్లిప్పుల పంపిణీని వార్డు వలంటీర్లకు అప్పగించొద్దని చెప్పారు. వలంటీర్ల కదలికలను నిశితంగా పరిశీలించాలని, లబ్దిదారుల డేటా దుర్వినియోగం కాకుండా వలంటీర్ల ఫోన్లను పర్యవేక్షించాలని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేశారు.

అభ్యర్థి, పార్టీకి అనుకూలంగా వలంటీర్లు వ్యవహరించరాదని వివరించారు. పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు.

More Telugu News