ఈ సారి బాంబులున్న కారు.. మీ పిల్లల వాహనాన్ని ఢీకొడుతుంది​: అంబానీకి ఉగ్రవాదుల హెచ్చరిక

28-02-2021 Sun 13:47
  • కారులో బాంబులు పెట్టింది తామేనన్న జైషుల్ హింద్
  • ఇప్పటిదాకా ఉగ్ర సంస్థ పేరే వినలేదంటున్న అధికారులు
  • టెలీగ్రామ్ యాప్ ద్వారా సందేశం పంపిన ఉగ్రవాద సంస్థ
  • బిట్ కాయిన్ లో డబ్బులివ్వాలని అంబానీకి డిమాండ్
  • దమ్ముంటే తమను ఆపాలని నిఘా సంస్థలకు సవాల్
Ambani bomb scare Jaish ul Hind claims responsibility threatens to ram SUV into Mukesh Ambani kids

రిలయన్స్ సంస్థల అధిపతి, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇల్లు యాంటీలియా ముందు కారులో బాంబులు పెట్టింది తామేనని జైషుల్ హింద్ అనే ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది.  టెలీగ్రామ్ యాప్ ద్వారా సందేశం పంపింది. ఇది కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించింది. బిట్ కాయిన్లలో డబ్బులు పంపించాలని డిమాండ్ చేసింది.

లేదంటే నీతా వదినా.. ముకేశ్ అన్నా.. ఈసారి బాంబులున్న కారు మీ పిల్లల కారుపైకి దూసుకెళ్తుందని బెదిరింపులకు దిగింది. నిఘా సంస్థలకూ వార్నింగ్ ఇచ్చింది. ‘‘దమ్ముంటే మమ్మల్ని ఆపండి చూద్దాం. ఢిల్లీ నడిబొడ్డులో మిమ్మల్ని కొట్టినా ఆపినోడే లేడు. మీరు చాలా దారుణంగా విఫలమయ్యారు. మళ్లీ మళ్లీ విఫలమవుతారు’’ అని హెచ్చరించింది.

మీ చుట్టుపక్కలే ఉన్నాం...

‘‘మేం ఎవరని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. మేం మీ పీడకలలం. మీ చుట్టుపక్కనే ఉన్నాం. మీ ఆఫీసులో పనిచేస్తున్నాం. ఓ మామూలు మనిషిలా మీ పక్కనే ఉన్నాం. మీ పక్క నుంచే వెళ్లే బిచ్చగాడిలా ఉన్నాం. ప్రతి చోటా మేమున్నాం. బీజేపీ, ఆరెస్సెస్ కు అమ్ముడు పోయిన మీ లాంటి వ్యాపార వ్యభిచారులతోనే మాకు పెద్ద సమస్య’’ అని సందేశంలో పేర్కొంది. దేవుడి దయతో అంబానీ ఇంటి ముందు కారు పెట్టిన సోదరుడు ఇల్లు చేరాడని పేర్కొంది.