ముగిసిన రామమందిరం విరాళాల సేకరణ... రూ.2 వేల కోట్లు వసూలు

28-02-2021 Sun 12:36
  • గత 44 రోజులుగా విరాళాల సేకరణ
  • నిన్నటితో ముగిసిన వైనం
  • చాలా డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉందన్న ట్రస్టు
  • విరాళాల మొత్తం మరింత పెరగొచ్చని వెల్లడి
  • నెలరోజుల పాటు ఆడిట్ నిర్వహిస్తామన్న ట్రస్టు వర్గాలు
Donations collecting concludes for Ram Mandir construction in Ayodhya

అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామ మందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన విరాళాల సేకరణ ముగిసింది. 44 రోజుల పాటు సాగిన ఈ విరాళాల సేకరణ నిన్నటితో ముగిసిందని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. రామ మందిరం కోసం రూ.2 వేల కోట్ల మేర విరాళాలు వచ్చాయని ట్రస్టు వర్గాలు తెలిపాయి. కాగా, ఇంకా చాలా నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉందని, ఆ ప్రక్రియ పూర్తయితే విరాళాల మొత్తం పెరిగే అవకాశముందని పేర్కొన్నాయి.

విరాళాల ద్వారా అందిన మొత్తం నగదుకు ఆడిట్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందని ట్రస్టు కార్యాలయం ఇన్చార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు. అందుకోసం ఓ యాప్ ను కూడా రూపొందించామని, ఈ ప్రక్రియలో పాల్గొనేవారు ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ అయి, ప్రతిరోజూ డేటాను యాప్ లో పొందుపరచాల్సి ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియ నెలరోజుల పాటు సాగనుందని చెప్పారు.