కాంగ్రెస్ బలహీనపడుతోంది... ఇది నిజం: కపిల్ సిబాల్

27-02-2021 Sat 18:02
  • జమ్మూకశ్మీర్ లో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్లు
  • పార్టీని బలోపేతం చేసుకోవడానికే వచ్చామన్న సిబాల్
  • పార్టీలోకి కొత్త తరం రావాల్సిన అవసరం ఉంది
Congress is weakening says Kapil Sibal

కాంగ్రెస్ బలహీనపడుతోందని.. పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్ నేత కపిల్ సిబాల్ అన్నారు. జమ్మూకశ్మీర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి కపిల్ సిబాల్, గులాం నబీ అజాద్, ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ, భూపీందర్ సింగ్ హుడా తదితర నేతలు హాజరయ్యారు. పార్టీ నాయకత్వంపై కాంగ్రెస్ పార్టీలోని 23 మంది సీనియర్లు అధిష్ఠానానికి రాసిన లేఖ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ 23 మందిలో వీరంతా ఉన్నారు.

ఈ సందర్భంగా కపిల్ సిబాల్ మాట్లాడుతూ, పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలో తామంతా ఇక్కడకు వచ్చామని చెప్పారు. పార్టీ బలోపేతం కోసమే తాము గొంతుకను వినిపిస్తున్నామని తెలిపారు. పార్టీలోకి కొత్త తరం రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వైభవాన్ని మనం చూశామని... తామంతా వృద్ధులు అవుతున్న సమయంలో పార్టీ బలహీనం కావడాన్ని చూడలేమని అన్నారు.