తన వాహనం టైరు తానే మార్చుకున్న మహిళా కలెక్టర్... వీడియో వైరల్

27-02-2021 Sat 17:19
  • మైసూరు జిల్లాకు కలెక్టర్ గా వ్యవహరిస్తున్న రోహిణి సింధూరి
  • కుటుంబంతో కలిసి కొడగు ప్రాంతంలో పర్యటన
  • స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన కలెక్టర్
  • మార్గమధ్యంలో టైరు పంక్చర్
  • ఎవరి సాయం తీసుకోకుండా టైరు మార్చిన వైనం
Mysore district collector Rohini Sindhuri changes her car tire

జిల్లా కలెక్టర్ అంటే ఎన్ని సదుపాయాలు ఉంటాయో, ఎంతమంది పనివాళ్లు, భద్రతా సిబ్బంది ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కర్ణాటకలో మైసూరు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న తెలుగమ్మాయి రోహిణి సింధూరి మాత్రం తన పనులు తానే చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తూ తన నిరాడంబరతను చాటుకుంటున్నారు. తాజాగా రోహిణి సింధూరి తన వాహనం టైరును స్వయంగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

ఇటీవల ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి కొడగు ప్రాంతంలో పర్యటించారు. అక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు స్వయంగా వాహనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. అయితే, తన వాహనం టైరు పంక్చర్ అయినా, ఎవరి సాయం కోరకుండా తానే అందుబాటులో ఉన్న పనిముట్లతో చకచకా టైరు మార్చేశారు. కారు టైరును జాకీ సాయంతో లేపి, దాన్ని తొలగించి, కొత్త టైరు బిగించారు. ఎంతో ప్రొఫెషనల్ గా ఈ పని చేసిన కలెక్టర్ రోహిణి సింధూరి ఏమాత్రం అలసట లేకుండా మళ్లీ ప్రయాణానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన రోహిణి సింధూరి 2009 కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారిణి. ఆమె కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుధీర్ రెడ్డిని పెళ్లాడిన రోహిణి ప్రస్తుతం మైసూరు జిల్లా కలెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోహిణి తెలుగు, కన్నడ, తమిళం, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.