Revanth Reddy: ఉద్యమమే శ్వాసగా బతికిన ప్రతి తెలంగాణ బిడ్డకు జరిగిన అవమానమిది: రేవంత్ రెడ్డి

  • ఏకశిల పార్కును జయశంకర్ స్మృతివనంగా మార్చే ప‌నులు
  • సీఎం కేసీఆర్ బొమ్మ‌లే అధికం
  • త్యాగాల చరిత్రకు భోగాల చెద అంటూ రేవంత్ విమ‌ర్శ‌లు
  • ఎవని పాలయిందిరో తెలంగాణ? అంటూ ఆగ్ర‌హం
revanth reddy fires on trs

హన్మకొండ ఏకశిల పార్కును తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్మృతివనంగా మార్చాలని నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. 2016లో ఇందుకు సంబంధించిన‌ పనులు ప్రారంభించారు. అయితే, ఇప్ప‌టికీ ఆ ప‌నులు సాగుతూనే ఉన్నాయంటూ, అందులో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ బొమ్మ‌ల‌ను పెట్ట‌డానికే అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారంటూ ఓ దిన‌ప‌త్రిక‌లో 'జయశంకర్‍ సార్ స్మృతివనంలో కేసీఆర్‍ జ్ఞాపకాలు' పేరిట వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

తెలంగాణ‌ ఉద్యమానికి జయశంకర్ చేసిన సేవలను గుర్తు చేసుకోవాల్సిన చోట ఆయన కంటే సీఎం కేసీఆరే ఎక్కువగా కనిపించేలా బొమ్మలు పెట్టారని అందులో ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. అంతేగాక‌, తెలంగాణ‌ పోరాటాన్ని పక్కనపెట్టేసి కేసీఆర్ దిక్షాదివస్ లో  నిమ్మరసం తాగే చిత్రాన్ని పెట్టార‌ని చెప్పారు.

మ‌రికొంచెం ముందుకు వెళ్లి  జయశంకర్ తో ఎప్పుడూ వేదికన పంచుకోని మంత్రి కేటీఆర్ చిత్రాన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. ఉద్యమ ఘట్టాలకు సంబంధించిన చిత్రాల్లో జయశంకర్  కంటే సీఎం కేసీఆర్ బొమ్మలే పెద్దగా పెట్టారని అందులో పేర్కొన్నారు.  వీటిని రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. 

'త్యాగాల చరిత్రకు భోగాల చెద! స్వరాష్ట్రం కోసం ప్రాణం ఒదిలినోళ్లు, ప్రాణం పెట్టినోళ్ల చరిత్ర చిన్నబోతోంది. ఉద్యమ మార్గదర్శి జయశంకర్ ‘సారు’ ఒక్కడికే  జరిగిన పరాభవం కాదు ఇది. రాష్ట్రమే కాంక్షగా... ఉద్యమమే శ్వాసగా బతికిన ప్రతి తెలంగాణ బిడ్డకు జరిగిన అవమానం. ఎవని పాలయిందిరో తెలంగాణ...?' అని రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

More Telugu News