Sunil Arora: 'పశ్చిమ బెంగాల్ లో 8 విడతల్లో ఎన్నికలు ఎందుకు?' అన్న ప్రశ్నకు ఈసీ సునీల్ అరోరా సమాధానం ఇది!

EC Sunil Arora Answer on West Bengal Long Poll Schedule
  • రాజకీయ పార్టీల పేర్లు అనవసరం
  • 2016లో ఏడు దశల్లో ఎన్నికలు
  • ఇప్పుడు 8 దఫాలు పెద్ద విషయం కాదన్న అరోరా
నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను జాతీయ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగత రాష్ట్రాల మాటెలా ఉన్నా, పశ్చిమ బెంగాల్ షెడ్యూల్ విషయంలో మాత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఈసీ వైఖరిపై మండిపడ్డారు. తమ రాష్ట్రంలో మాత్రమే ఎనిమిది దశల్లో ఎన్నికలు ఏంటని ఆమె ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ ను బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు.

ఇక ఈ ప్రశ్నకు సమాధానాన్ని సునీల్ అరోరా నిన్ననే చెప్పేశారు. 2016లో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయని గుర్తు చేశారు. తాను రాజకీయ పార్టీల పేర్లను ప్రస్తావించబోనని వ్యాఖ్యానించిన ఆయన, పార్టీల పేర్లు అనవసరమని, శాంతి భద్రతలను ప్రభావితం చేసే ఎన్నో అంశాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. 2016లో ఏడు విడతల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో ఇప్పుడు 8 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని భావించడం పెద్ద విషయం కాదన్నారు.

కాగా, బెంగాల్ లో మార్చి 27న తొలి విడత ఎన్నికలు జరుగనుండగా, ఎనిమిదో విడతగా ఏప్రిల్ 29న ఎన్నికలు జరుగుతాయి. ఆపై మే 2న ఫలితాలు వెలువడతాయి. ఐదేళ్ల నాటి ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితమైన బీజేపీ, ఆపై లోక్ సభ ఎన్నికల నాటికి పుంజుకుని, ఇప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది.
Sunil Arora
EC
West Bengal
8 Phase Elections

More Telugu News