సజ్జల నన్ను విమర్శించేంతటివాడా... ఏనాడైనా ఎన్నికల్లో నిలిచి గెలిచాడా?: చంద్రబాబు ఫైర్

26-02-2021 Fri 19:52
  • కుప్పం కోట బద్దలైందన్న సజ్జల
  • విమర్శలు చేసేందుకు సజ్జలకున్న అర్హత ఏంటన్న చంద్రబాబు
  • తాను ఇప్పటివరకు మాట తూలలేదని స్పష్టీకరణ
  • తనకు ప్రజాబలం ఉందని ధీమా
Chandrababu qusttions Sajjala what qualification he has to criticise him

చంద్రబాబుకు మిగిలిన ఏకైక కోటగా చెప్పుకుంటున్న కుప్పం కూడా బద్దలైందని, దాంతో చంద్రబాబు మానసిక సంక్షోభానికి గురయ్యారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేయడం తెలిసిందే. దీనిపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. సజ్జల నన్ను విమర్శించేంతటి వాడా? అని ప్రశ్నించారు. నన్ను విమర్శించేందుకు నీకేం అర్హత ఉందో ముందు అది తెలుసుకో... ఏనాడైనా ఎన్నికల్లో నిలిచి గెలిచావా? అని నిలదీశారు. తాను ఇప్పటివరకు మాట తూలింది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు ప్రజాబలం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

కుప్పం నియోజకవర్గంలోని రాజ్ పేట్ లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం అస్తవ్యస్తంగా మారుతోందని, రాష్ట్రాన్ని స్వాహా చేయాలని కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. జగన్ ఒక డ్రామారాయుడు అని, సీఎం జగన్ కు సెంటిమెంట్ అంటే తెలియదని విమర్శించారు. విశాఖ ఉక్కును కూడా కోల్పోతున్నామని అన్నారు.