మాకు మాత్రమే 8 విడతల్లో ఎన్నికలను ఎందుకు నిర్వహిస్తున్నారు?: మమతా బెనర్జీ
- నాలుగు రాష్ట్రాలు, ఒక యూటీకి ఎన్నికలు
- బెంగాల్ కు 8 విడతల్లో జరగనున్న పోలింగ్
- బీజేపీ సౌకర్యం కోసమే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని మమత ఆరోపణ
ఒక్క బెంగాల్ కు మాత్రమే 8 విడతల్లో పోలింగ్ ను ఎందుకు నిర్వహిస్తున్నారని మమత ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని చెపుతూనే... బీజేపీ సౌకర్యం కోసమే ఈసీ ఇన్ని విడతల్లో పోలింగ్ నిర్వహిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని ప్రశ్నించారు. బెంగాల్ లో బీజేపీ ప్రచారాన్ని సులభంగా నిర్వహించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని అడిగారు.
ఒకే జిల్లాలో వేర్వేరు దశల్లో పోలింగ్ నిర్వహించాలనే నిర్ణయంపై కూడా మమత మండిపడ్డారు. దక్షిణ 24 పరగణా జిల్లాలో తాము బలంగా ఉన్నామని... ఆ జిల్లాలో మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. మతం ఆధారంగా ప్రజలను బీజేపీ విభజిస్తోందని దుయ్యబట్టారు. ఆట ప్రారంభమైందని... ఆటలో గెలిచి చూపిస్తామని అన్నారు.