Balakot Air Strikes: బాలాకోట్​ పై భారత్ వైమానిక దాడులకు రెండేళ్లు.. రక్షణ మంత్రి, హోం మంత్రి స్పందన

  • పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలపై దాడి
  • వందలాది మంది ఉగ్రవాదుల హతం..
  • బలగాల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానన్నరాజ్ నాథ్
  • ఉగ్రవాదంపై భారత్ దృక్పథానికి నిదర్శనమన్న అమిత్ షా
2 years of Balakot airstrike Rajnath Singh Amit Shah pay tributes

అందరూ హాయిగా నిద్రపోతున్న టైం అది. నిశీధి పరిచేసిన గగన వీధుల్లో ఝమ్మంటూ దూసుకెళ్తున్న యుద్ధ విమానాల నుంచి జారిన జ్వాలా క్షిపణులు.. క్షణాల్లో ఉగ్ర స్థావరాలను అగ్ని కీలల్లో ముంచెత్తాయి. వందలాది మంది ఉగ్రమూకలను ఆహుతి చేశాయి.

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనికులను బలిగొన్న ఉగ్రదాడులకు ప్రతీకారంగా.. వారం రోజులు తిరగకముందే ఫిబ్రవరి 26న పాక్ ఆక్రమిత భూభాగంలో ఉన్న బాలాకోట్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన వైమానిక దాడులివి. గుండెల్లో నివురుగప్పిన ఆ ప్రతీకారాన్ని తీర్చుకుని నేటికి రెండేళ్లు.

ఈ సందర్భంగా వైమానిక దళ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడుతూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా బాలాకోట్ దాడులను గుర్తు చేసుకున్నారు. ‘‘బాలాకోట్ పై వైమానిక దాడులకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారత వైమానిక దళ ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నా. ఉగ్రవాదంపై తమ పోరాటం సాగుతుందని చెప్పడానికి ఈ దాడులే నిదర్శనం. దేశాన్ని ఎల్లప్పుడూ భద్రంగా, సురక్షితంగా ఉంచుతున్న సాయుధ బలగాలు మాకు గర్వకారణం’’ అని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు.

బాలాకోట్ పై దాడులతో ఉగ్రవాదంపై భారత్ దృక్పథం ఏంటో మరోసారి రుజువు చేసిందని అమిత్ షా అన్నారు. ‘‘పుల్వామాలో అమరుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. బాలాకోట్ దాడుల సందర్భంగా వైమానిక దళాలు చూపించిన తెగువకు సెల్యూట్ చేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ, సైనికుల భద్రతే మాకు ప్రధానం’’ అని ట్వీట్ చేశారు.

కాగా, బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్స్ తర్వాత జరిగిన ఘర్షణల్లో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ ఎఫ్16 విమానాన్ని కూల్చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో పాక్ భూభాగంలో ఆయన విమానం కూలిపోయింది. అక్కడి వారికీ అభినందన్ బందీగా చిక్కాడు. పాక్ సైనికులు ఆయన్ను అదుపులోకి తీసుకుని, కొన్ని రోజులు విచారించిన తర్వాత, అంతర్జాతీయ ఒత్తిడి మేరకు తిరిగి భారత్ కు అప్పగించారు.

More Telugu News