భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం... తెరవెనుక దోవల్ మంత్రాంగం

25-02-2021 Thu 19:52
  • సరిహద్దు వెంబడి శాంతికి దాయాదుల నిర్ణయం
  • కాల్పులు జరపరాదని పరస్పర అంగీకారం
  • ఒప్పందం కుదిరేలా కీలకపాత్ర పోషించిన అజిత్ దోవల్
  • ఇమ్రాన్ భద్రతా సలహాదారుతో అనేక పర్యాయాలు చర్చలు
Ajit Dhoval plays crucial role in cease fire pact between India and Pakistan

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గతంలో సీక్రెట్ ఏజెంట్ అన్న సంగతి తెలిసిందే. జేమ్స్ బాండ్ ను తలపించేలా అనేక గూఢచర్య ఆపరేషన్లను ఆయన విజయవంతంగా పూర్తిచేశారు. జాతీయ భద్రతా సలహాదారు పదవి చేపట్టాక కూడా దోవల్ తన వ్యూహ చతురతతో అనేక అంతర్జాతీయ అంశాల్లో భారత్ ను ఓ మెట్టుపైనే నిలిపారు. తాజాగా భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం ఓ సంచలనమైతే, ఆ నిర్ణయం వెనుక కీలకపాత్ర పోషించింది అజిత్ దోవల్ అని వెల్లడైంది. తనకు అలవాటైన మార్గాల్లో ఆయన చేసిన తెరవెనుక కృషి ఈ ఒప్పందం కార్యరూపం దాల్చడానికి ఉపకరించింది.

అసలు, పాక్ ఇంతటి కీలక నిర్ణయం తీసుకోవడానికి ఎలా ఒప్పుకుందన్నది ఇప్పటికీ చాలామందికి నమ్మశక్యంగా లేదు. అయితే, దీనికి చాలారోజుల ముందు నుంచే దోవల్ తన పని ప్రారంభించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్  ఖాన్ భద్రతా సలహాదారు మొయిద్ యూసుఫ్ తో క్రమం తప్పకుండా చర్చలు జరుపుతూ నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లారు. తన చర్చల పురోగతిని ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాలతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వారి సూచనలు పాటిస్తూ తన వ్యూహచతురతకు మరింత పదునుపెట్టారు.

సుదీర్ఘకాలంగా హింసనే నమ్ముకున్న పాక్ అధినాయకత్వాన్ని కూడా హింసతో ఏమీ సాధించలేమని నమ్మేలా చేశాడు. భారత్ మాత్రమే కాదు, పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని ఇమ్రాన్ ఖాన్ బృందానికి అర్థమయ్యేలా తనదైన శైలిలో విడమర్చాడు. మొత్తమ్మీద పాక్ ను కీలక ఒప్పందం దిశగా నడిపించాడు. అయితే దోవల్ ఎంత కృషి చేసినా... పాక్ నైజం తెలిసిన భారత్ అప్రమత్తంగా ఉండకతప్పదని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. సరిహద్దుల్లో శాంతిని పాటించాలని, కాల్పులు జరపకూడదని 2003లో ఒప్పందాలు జరిగినా, ఆ తర్వాత ఆ ఒప్పందాలకు ఎన్నిసార్లు తూట్లు పడ్డాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అంటున్నారు.