పింక్ బాల్ తో 5 వికెట్లు తీసిన రూట్... 145 పరుగులకే కుప్పకూలిన భారత్

25-02-2021 Thu 16:24
  • మొతేరాలో స్పిన్నర్ల జోరు
  • వికెట్లు పంచుకున్న రూట్, లీచ్
  • లీచ్ కు 4 వికెట్లు
  • రోహిత్ శర్మ 66
  • భారత్ లోయరార్డర్ ను తుడిచిపెట్టిన రూట్
Root collapsed India lower order

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న పింక్ బాల్ డేనైట్ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 145 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులకే ఆలౌట్ కాగా, భారత్ కు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రం దక్కింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో మెరుగైన స్కోరు సాధిస్తుందని భావించినా, రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన బౌలింగ్ గణాంకాలు నమోదు చేయడం విశేషంగా నిలిచింది.

రూట్ 6.2 ఓవర్లు విసిరి 8 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అందులో మూడు మెయిడెన్లు ఉన్నాయి. పార్ట్ టైమ్ బౌలర్ గా సేవలందించే రూట్... స్పిన్ కు విశేషంగా సహకరిస్తున్న పిచ్ పై ప్రధాన బౌలర్లను మించిపోయి బౌలింగ్ చేశాడు. రూట్ బంతులను ఎదుర్కొనేందుకు టీమిండియా లోయర్ ఆర్డర్ ఆపసోపాలు పడింది. టీమిండియా ఇన్నింగ్స్ లో 66 పరుగులు సాధించిన రోహిత్ శర్మే టాప్ స్కోరర్. కోహ్లీ 27 పరుగులు చేయగా, అశ్విన్ 17 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇవాళ్టి ఆటలో భారత్ పతనాన్ని ప్రారంభించింది లీచ్ కాగా, రూట్ ముగింపు పలికాడు.

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆండర్సన్, బ్రాడ్, ఆర్చర్ రూపంలో ముగ్గురు పేసర్లను తీసుకోగా, వారు నామమాత్రంగా మిగిలారు. ఆర్చర్ మాత్రం ఒక్క వికెట్ తీశాడు. మిగతా 9 వికెట్లను రూట్, లీచ్ పంచుకున్నారు.