పెయిడ్ ఆర్టిస్టు అన్నందుకే విష్ణువర్ధన్ రెడ్డి పట్ల అలా ప్రవర్తించా: ఏపీ పరిరక్షణ సమితి నేత శ్రీనివాసరావు

24-02-2021 Wed 20:32
  • ఛానల్ లో లైవ్ డిబేట్ సందర్భంగా విష్ణుపై దాడి
  • విష్ణును చెప్పుతో కొట్టిన శ్రీనివాసరావు
  • పెయిడ్ ఆర్టిస్టులు అనడం దారుణమన్న శ్రీనివాసరావు
Vishnu Vardhan Reddy called me paid artist says Srinivas Rao

ఎబిఎన్  ఛానల్ లో నిన్న సాయంత్రం జరిగిన చర్చ సందర్భంగా ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై ఏపీ పరిరక్షణ సమితి నేత శ్రీనివాసరావు దాడి చేశారు. లైవ్ లోనే విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ ఘటనను బీజేపీ నేతలు ఖండించారు.

మరోవైపు ఈ ఘటనపై శ్రీనివాసరావు వివరణ నిచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డితో తనకు పరిచయం లేదని ఆయన అన్నారు. ఏపీ పరిరక్షణ సమితి తరపున తాను అమరావతి రైతులు, జేఏసీతో కలిసి పని చేస్తున్నానని చెప్పారు. తాను ఎవరో కూడా తెలియకుండానే తనను పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారని మండిపడ్డారు.

అమరావతికి చెందిన ఎంతో మంది రైతులు రాజధాని కోసం ఉద్యమం చేస్తున్నారని... అలాంటి ఉద్యమంలో పెయిడ్ అర్టిస్ట్ అనే పదాన్ని వాడటం దారుణమని అన్నారు. ఉద్యమం చేస్తున్న రైతులను, వారికి మద్దతుగా ఉన్న తనను పెయిడ్ ఆర్టిస్టులు అని విష్ణు అన్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే క్షణికావేశంలో విష్ణు పట్ల అలా ప్రవర్తించానని, అది  దురదృష్టకరమని చెప్పారు.