Rahul Gandhi: క్రికెట్ స్టేడియంకు మోదీ పేరు పెట్టడంపై రాహుల్ గాంధీ విమర్శలు

 Rahul Gandhi criticizes Modis naming of cricket stadium
  • మొతేరా స్టేడియంకు నరేంద్ర మోదీ పేరు
  • స్టేడియంలోని రెండు ఎండ్ లకు అంబానీ, అదానీల పేర్లు
  • అసలైన నిజం దానంతట అదే బయటపడిందన్న రాహుల్
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్మించిన సంగతి తెలిసిందే. మొతేరా స్టేడియంగా పేరుగాంచిన దీని అసలు పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం. అయితే ఈ స్టేడియంను పునర్నిర్మించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టారు. ఈ స్టేడియంను ఈరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీసీసీఐ కార్యదర్శి జై షా (అమిత్ షా కుమారుడు), కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హాజరుకాలేదు.

మరోవైపు ఈ స్టేడియంకు నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అసలైన నిజం దానంతట అదే బయటపడటం చాలా బాగుందని ఆయన అన్నారు. 'నరేంద్ర మోదీ స్టేడియం, అదానీ ఎండ్, రిలయన్స్ ఎండ్, కార్యక్రమానికి హాజరైన జై షా' అంటూ ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు.

ఇండియన్ బిలియనీర్స్ ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ ఇద్దరూ గుజరాత్ కు చెందినవారే. వీరిద్దరికీ మోదీ, అమిత్ షాలు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ కొంత కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. మోదీ, అమిత్ షాలు అంబానీ, అదానీలకు మాత్రమే మేలు చేసేలా పాలిస్తున్నారని అర్థం వచ్చేలా 'హమ్ దో.. హమారే దో' అనే నినాదాన్ని ఇటీవలి కాలంలో రాహుల్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈరోజు చేసిన ట్వీట్ ను కూడా అదే ఉద్దేశంతో చేశారు.
Rahul Gandhi
Congress
Narendra Modi
Amit Shah
Mukhesh Ambani
Adani

More Telugu News