మార్చి 1 నుంచి కరోనా వ్యాక్సిన్.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేయించుకుంటే ఫ్రీ!

24-02-2021 Wed 19:20
  • 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్
  • రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యాధులున్న 45 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కూడా
  • ప్రైవేటు ఆసుపత్రుల్లో వేయించుకునే వారు డబ్బులు చెల్లించాలి
Free Covid vaccine for above 60 years people from March 1

60 ఏళ్ల పైబడిన వారికి మార్చి 1 నుంచి కరోనా వ్యాక్సిన్ ను ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వీరితో పాటు రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కూడా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు.

దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ సెంటర్లలో వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకునే వారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు ఎంత వసూలు చేయాలో మూడు, నాలుగు రోజుల్లో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటిస్తుందని చెప్పారు.