మ‌హారాష్ట్ర‌లో ఓ వైపు క‌రోనా విజృంభ‌ణ‌.. మ‌రోవైపు గుడి వ‌ద్ద 8 వేల మందితో మంత్రి.. వీడియో ఇదిగో

24-02-2021 Wed 10:52
  • క‌రోనా నిబంధ‌న‌ల‌ ఉల్లంఘన 
  • ఇప్ప‌టికే ఓ మ‌హిళ‌ ఆత్మహత్య ఉదంతంలో సంజయ్ రాథోడ్
  • తాజాగా బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న రీతిలో వ్య‌వ‌హారం
  • జ‌నాల‌పై పోలీసుల లాఠీచార్జి
Crowd gathers as Maharashtra Minister Sanjay Rathods convoy

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విజృంభ‌ణ తీవ్ర స్థాయిలో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, విజృంభణ ఇలాగే కొన‌సాగితే పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తామ‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తోంది. ఇటువంటి స‌మ‌యంలో మ‌హారాష్ట్ర మంత్రే క‌రోనా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ తీవ్ర నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి, త‌న బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేస్తోన్న రీతిలో ఎనిమిది వేలకుపైగా జ‌నం మ‌‌ధ్య గుడికి వెళ్లారు.

అస‌లే పూజ చవాన్ అనే మ‌హిళ‌ ఆత్మహత్య ఉదంతంలో చిక్కుకున్న సదరు మంత్రి సంజయ్ రాథోడ్ ఇప్పుడు ఈ తీరుగా వ్య‌వ‌హ‌రించి మ‌రిన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. నిన్న ఆయన పోహ్రా దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. వేలాది మంది ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వేలాది మందిని పోలీసులు అదుపుచేయ‌లేపోయారు. వారిపై లాఠీచార్జి చేయాల్సి రావ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ ఘ‌ట‌న‌పై  ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక‌రే దర్యాప్తునకు ఆదేశించారు.