విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య.. ఆధిపత్యం కోసమేనని అనుమానం

24-02-2021 Wed 06:56
  • ఇంటి బయట కూర్చున్న బండరెడ్డిపై ఇనుపరాడ్లతో దాడి
  • కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి చంపిన వైనం
  • అతడితో పాటు తిరిగిన వ్యక్తులే చంపి ఉంటారని అనుమానం
  • పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
Rowdy Sheeter Killed in Visakhapatnam

విశాఖపట్టణంలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి బయట ఫుట్‌పాత్‌పై కూర్చున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆపై కత్తులతో పొడిచి చంపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసుల కథనం ప్రకారం.. మద్దిలపాలెం సమీపంలోని కేఆర్ఎం కాలనీకి చెందిన రౌడీ షీటర్ వెంకట్‌రెడ్డి అలియాస్ బండరెడ్డి గత రాత్రి తన ఇంటి సమీపంలో ఫుట్‌పాత్‌పై కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో బైక్‌లపై ఇద్దరు, కారులో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెంకటరెడ్డిపై దాడికి దిగారు. తొలుత ఇనుపరాడ్లతో దాడిచేసి ఆపై కత్తులతో పొడిచారు. దీంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

విభేదాల కారణంగా అతడితోపాటు తిరిగే వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, ఆధిపత్యం కోసమే ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బండరెడ్డిపై రెండు హత్యకేసులు కూడా ఉన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.