'యువరానర్' అని పిలవడం మన సంప్రదాయం కాదు: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

23-02-2021 Tue 21:37
  • యువరానర్ అనే పదం అమెరికాకు చెందినది
  • అలా పిలవాలని మేము ఎప్పుడూ చెప్పలేదు
  • గౌరవంగా సర్ అని పిలిచినా మాకు ఆమోదమే
Calling as Your Honour is not our custom says SA Bobde

జడ్జిలను యువరానర్ అని సంబోధించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే తనను యువరానర్ అని సంబోధించడంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా పిలుస్తున్నారంటే అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినో, లేదా మేజిస్ట్రేట్ నో ఉద్దేశించి మాట్లాడుతున్నారని అర్థమని చెప్పారు.

ఓ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకు హాజరైన ఓ న్యాయ విద్యార్థిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వెంటనే సదరు న్యాయ విద్యార్థి స్పందిస్తూ... మీ లార్డ్ అని సంబోధిస్తానని చెప్పాడు. అలాంటి పదాలను వాడాలని తాము ఎప్పుడూ చెప్పలేదే అని వ్యాఖ్యానించారు. గౌరవంగా 'సర్' అని పిలిచినా తమకు ఆమోదమేనని చెప్పారు.

గత అక్టోబర్ లో కూడా ఓ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఇదే వ్యాఖ్యలు చేశారు. యువరానర్ అనే పదం అమెరికాలో ఉంటుందని... అది ఇక్కడి సంప్రదాయం కాదని అన్నారు. మీరు అమెరికా సుప్రీంకోర్టులో ఉన్నారనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి 2014లోనే సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మైలార్డ్, యువర్ లార్డ్ షిప్, యువరానర్ వంటి పదాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని అప్పట్లో జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఎస్ఏ బాబ్డేలతో కూడిన ధర్మాసనం తెలిపింది.

మరోవైపు, 2006లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. న్యాయస్థానాలను గౌరవించాల్సిన బాధ్యత లాయర్లపై ఉందని తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో యువరానర్ లేదా ఆనరబుల్ కోర్ట్ అని పిలవాలని... దిగువ కోర్టులు లేదా ట్రైబ్యునళ్లలో మాత్రం సర్ అని కానీ లేదా ప్రాంతీయ భాషల్లో దానికి సమానమైన పదాన్ని వినియోగించాలని తెలిపింది.