మహిళలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్

23-02-2021 Tue 19:40
  • దశాబ్దాల నిబంధనలకు చరమగీతం పలుకుతున్న మహ్మద్ బిన్ సల్మాన్
  • ఇప్పటికే మహిళల డ్రైవింగ్ కు అనుమతి
  • తాజాగా రక్షణ రంగంలో పని చేసేందుకు అనుమతినిస్తూ నిర్ణయం
Saudi Arabia allows women to work in defence

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విజన్ 2030లో భాగంగా... శతాబ్దాలుగా అమల్లో ఉన్న కఠినమైన నిబంధనలకు ఆయన చరమగీతం పలుకుతున్నారు. మహిళల జీవితాలలో వెలుగులు నింపేలా సంస్కరణలను తీసుకొస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే మహిళల డ్రైవింగ్ కు అనుమతించడం, ఇంట్లోని పురుషుల అనుమతి లేకుండా ఒకచోటు నుంచి మరొకచోటికి ఒంటరిగా ప్రయాణించడం, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో పని చేసేందుకు అవకాశం కల్పించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా మహ్మద్ బిన్ సల్మాన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రక్షణ రంగంలో మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు.

ఇకపై మహిళలు రాయల్ సౌదీ అరేబియన్ ఆర్మీ, రాయల్ సౌదీ నేవీ, రాయల్ సౌదీ ఎయిర్ డిఫెన్స్, రాయల్ సౌదీ స్ట్రాటజిక్ మిస్సైల్ ఫోర్స్, సాయుధ దళాల మెడికల్ సర్వీసెస్ లో చేరొచ్చని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. క్రౌన్ ప్రిన్స్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆ దేశ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.