భీష్మ ఏకాదశి పర్వదినాన భీష్మాచార్యగా నందమూరి బాలకృష్ణ

23-02-2021 Tue 15:18
  • గతంలో 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రంలో నటించిన బాలయ్య
  • భీష్ముడి పాత్ర పోషించిన వైనం
  • సినిమా లెంగ్త్ పెరగడంతో ఎడిటింగ్ లో పోయిన సీన్లు
  • ఆ స్టిల్స్ ను నేడు పంచుకున్న బాలయ్య
 Balakrishna shares Bishma getup stills from NTR Kathanayakudu

టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ గతంలో తన తండ్రి నటజీవితం ఆధారంగా 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రంలో నటించారు. ఈ సినిమాలో బాలకృష్ణ భీష్ముడి పాత్ర కూడా పోషించారు. అయితే సినిమా నిడివి పెరగడంతో భీష్ముడి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తొలగించారు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలయ్య 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రంలోని కొన్ని స్టిల్స్ ను విడుదల చేశారు. ఆయన భీష్ముడి గెటప్ లో ఉండడాన్ని ఆ స్టిల్స్ లో చూడొచ్చు.

దీనిపై బాలయ్య స్పందిస్తూ.... భీష్ముడి పాత్ర అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. తన తండ్రి వయసుకుమించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందారని వెల్లడించారు. నాటి భీష్మ చిత్రంలో తన తండ్రి ఎన్టీఆర్ నటించిన వైనం తనకు బాగా ఇష్టమని వివరించారు. అందుకే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో భీష్ముడి సన్నివేశాలు తీశామని, కానీ సినిమా మరీ పెద్దది కావడంతో ఆ సీన్లు ఉంచడం కుదరలేదని పేర్కొన్నారు. ఇవాళ భీష్మ ఏకాదశి కావడంతో ఆ పాత్రకు సంబంధించిన ఫొటోలను ప్రేక్షకులతోనూ, అభిమానులతోనూ పంచుకోవాలనుకుంటున్నానని వెల్లడించారు.