నాడు అసిస్టెంట్ గా మహేశ్ బాబుకు క్లాప్ కొట్టాడు... ఇప్పుడు మహేశ్ బాబుతోనే 'క్లాసిక్' అనిపించుకున్నాడు!

23-02-2021 Tue 13:20
  • ఇటీవల రిలీజైన 'ఉప్పెన'
  • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చిత్రం
  • 'ఉప్పెన' చిత్ర దర్శకుడిపై మహేశ్ బాబు ప్రశంసల జల్లు
  • గతంలో మహేశ్ బాబు చిత్రానికి సహాయదర్శకుడిగా బుచ్చిబాబు
  • అదే అంశాన్ని ప్రస్తావించిన పీఆర్వో బీఏ రాజు
Uppena director Buchibabu Sana now and then

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు బుచ్చిబాబు సానా. ఈ నెల 12న విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'ఉప్పెన' చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు తొలి చిత్రంతోనే హిట్ కొట్టడమే కాదు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు వంటి అగ్రతారలు బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు.

కాగా, ప్రముఖ పీఆర్వో బీఏ రాజు 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబుకు సంబంధించిన ఆసిక్తకర అంశాన్ని వెల్లడించారు. మహేశ్ బాబు హీరోగా వచ్చిన 'వన్.. నేనొక్కడినే' చిత్రం షూటింగ్ సమయంలో  సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు ఇవాళ మహేశ్ బాబుతోనే ప్రశంసలు పొందే స్థాయికి ఎదిగాడని బీఏ రాజు తెలిపారు. నాడు సహాయ దర్శకుడిగా మహేశ్ బాబుకు క్లాప్ కొట్టాడని, ఇప్పుడు క్లాసిక్ సినిమా తీశావంటూ మహేశ్ బాబు అభినందనలకు పాత్రుడయ్యాడని వివరించారు. దీనికి సంబంధించిన చిత్రాలను కూడా బీఏ రాజు పంచుకున్నారు. దీనిపై బుచ్చిబాబు వినమ్రంగా స్పందిస్తూ బీఏ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా వచ్చిన ఉప్పెన చిత్రం ఈ సీజన్ లో సక్సెస్ ఫుల్ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందగా, వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలతో పాటు విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఓవరాల్ గా దర్శకుడు బుచ్చిబాబు సానాకు ఫుల్ మార్కులు పడుతున్నాయి.