కరోనా కొత్త స్ట్రెయిన్లకు డబ్ల్యూహెచ్​ వో కొత్త పేర్లు

23-02-2021 Tue 12:43
  • మంగళవారం ప్రకటిస్తామన్న సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్
  • దేశాల పేర్లతో పిలవడం ఇష్టం లేదని వెల్లడి
  • కొత్త వేరియంట్లనూ తట్టుకునే వ్యాక్సిన్లకు రూపకల్పన
WHO to standardise naming of Covid strains
బ్రిటన్ (కెంట్) స్ట్రెయిన్, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్, బ్రెజిల్ స్ట్రెయిన్.. కొత్త రకం కరోనాలకు మనం పెట్టిన పేర్లివి. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) కు ఆ కొత్త స్ట్రెయిన్లను దేశాల పేర్లు పెట్టి పిలవడం ఇష్టం లేదు. అందుకే వాటికి కొత్త పేర్లు పెట్టాలని నిర్ణయించింది. ఈరోజే (మంగళవారం) వాటికి అధికారిక పేర్లను ప్రకటిస్తామని డబ్ల్యూహెచ్ వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు.

‘‘కొత్త స్ట్రెయిన్లకు మంగళవారం ప్రామాణికమైన పేర్లను ప్రకటిస్తాం. వాటిని దేశాల పేర్లు పెట్టి పిలవడం మాకు ఇష్టం లేదు. అంతేకాకుండా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మ్యుటేషన్లపై ఓ కన్నేసి ఉంచేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుంది’’ అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లుయెంజాకు ఉన్నట్టే కొవిడ్ పైనా కమిటీ వేస్తామన్నారు. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన బయో ఏషియా2021 సదస్సులో మాట్లాడారు.  

కరోనా టీకాల ప్రభావాన్ని ఈ మ్యుటేషన్లు తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ఇన్ ఫ్లుయెంజాలాగానే కరోనాపైనా కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఎంఆర్ఎన్ఏ, వైరల్ వెక్టర్ ఆధారంగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న కంపెనీలు.. ఈ కొత్త వేరియంట్లనూ తట్టుకునేలా భవిష్యత్ టీకాలకు రూపకల్పన చేస్తున్నాయని ఆమె వివరించారు. దాని ప్రభావాన్ని అంచనా వేయడం కోసం కమిటీకి ఆయా సంస్థలు క్లినికల్ ట్రయల్స్ డేటాను ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. రాబోయే రెండు మూడు వారాల్లో కొత్త వ్యాక్సిన్లకూ అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు.