మాజీ ఎంపీ ధనంజయ్ మహాడిక్ ఇంట ఘనంగా పెళ్లి వేడుక.. నిర్వాహకులపై కేసు నమోదు

23-02-2021 Tue 09:08
  • మాజీ ఎంపీ కుమారుడి రిసెప్షన్
  • హాజరైన వేలాదిమంది అతిథులు
  • శరద్ పవార్,  సంజయ్ రావత్, ఫడ్నవీస్ తదితరుల హాజరు
  • కరోనా నిబంధనలు బేఖాతరు
Former BJP MP booked for violation of Covid norms

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న వేళ మాజీ ఎంపీ ధనంజయ్ మహాడిక్ ఇంట ఘనంగా జరిగిన పెళ్లి వేడుక కలకలం రేపింది. పూణెలో జరిగిన ఈ పెళ్లికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. అయితే, వీరిలో ఏ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించకపోవడం గమనార్హం. ఒక్కరు కూడా మాస్కులు ధరించలేదు సరికదా, అందరూ రాసుకుపూసుకు కనిపించారు.

మగర్‌పట్టాలోని లక్ష్మీ లాన్స్‌లో ఆదివారం మహాడిక్ కుమారుడి వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. వీవీఐపీలు సహా వేలాదిమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రావత్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు హాజరయ్యారు. అయితే, కార్యక్రమంలో ఎక్కడా భౌతిక దూరం నిబంధనలు పాటించలేదని, ఎవరూ మాస్కులు ధరించలేదని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ ఎంపీ ధనంజయ్, లక్ష్మీ లాన్ యజమాని వివేక్ మగర్, మేనేజర్ నిరూపల్ కేదార్‌లపై హడప్‌సర్ పోలీసులు కేసు నమోదు చేశారు.