ఓటుకు నోటు కేసు: సీడీలు, హార్డ్ డిస్కులు సమర్పించాలని ఏసీబీకి కోర్టు ఆదేశం

22-02-2021 Mon 19:20
  • సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు
  • ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న విచారణ
  • విచారణకు హాజరైన రేవంత్, సెబాస్టియన్, ఉదయ్ సింహా
  • తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా
Court orders ACB officials to hand over CDs and Hard Disks related to Cash For Vote case

సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో హైదరాబాదు ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాదనలు విన్న కోర్టు ఈ కేసు వివరాలకు సంబంధించిన సీడీలు, హార్డ్ డిస్కులను సమర్పించాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. సాక్షుల విచారణ షెడ్యూల్ ఖరారు నిమిత్తం తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.

కాగా, ఇవాళ్టి విచారణకు ఈ కేసులో నిందితులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహా వ్యక్తిగతంగా హాజరయ్యారు. దేశంలో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను సత్వరమే విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ న్యాయస్థానం ఈ కేసులో నిందితులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని గతంలో ఆదేశాలిచ్చింది.

ఈ కేసులో ఈ నెల 16న నిందితులపై అభియోగాలు నమోదు చేయడం తెలిసిందే. నిందితులపై సెక్షన్ 12 నమోదుతో పాటు ఐపీసీ 120బి రెడ్ విత్ 34 కింద అభియోగాలు నమోదు చేశారు.