మా విజేతల వివరాలు వెబ్ సైట్లో విడుదల చేశాం... మీ వాళ్ల ఫొటోలు విడుదల చేయగలరా?: చంద్రబాబుకు సజ్జల సవాల్

22-02-2021 Mon 18:57
  • ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు
  • ఫలితాలపై భిన్న ప్రకటనలు చేసిన వైసీపీ, టీడీపీ
  • టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న సజ్జల
  • ఇంకా ఎందుకు అబద్ధాలు చెబుతారంటూ చంద్రబాబుపై విమర్శలు
Sajjala challenges Chandrababu to reveal winners among TDP supporters

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబు గారూ, ఇంకా అబద్ధాలు చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. తప్పుడు ప్రకటనలు చేయడమేంటని నిలదీశారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఎక్కడెక్కడ గెలిచారో వారి ఫొటోలతో సహా జాబితాలు వెబ్ సైట్లో (ysrcppolls.in) విడుదల చేశామని తెలిపారు. మరి, టీడీపీ వాళ్లు ఎక్కడెక్కడ గెలిచారో ఫొటోలు సహా జాబితాలు విడుదల చేయగలరా? అంటూ చంద్రబాబుకు సజ్జల సవాల్ విసిరారు.

అంతకుముందు ఓ ట్వీట్ లో ఆయన స్పందిస్తూ, రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే ప్రజలు ఇప్పుడు తిరగరాశారని పేర్కొన్నారు. నిజాయతీ, నిబద్ధతతో హామీలను నెరవేర్చే జగనే మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ తీర్పు ద్వారా వెల్లడించారని సజ్జల వివరించారు.