హైదరాబాదులో టీసీఎస్ ఉద్యోగి ఆత్మహత్య

22-02-2021 Mon 16:44
  • ఎస్ఆర్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న బాలశ్రీధర్ అనే ఐటీ ఉద్యోగి
  • అప్పుల భారంతో బలవన్మరణం
  • ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకున్న వైనం
TCS Employee in Hyderabad commits suicide

హైదరాబాదులో మరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన నడిశెట్టి బాలశ్రీధర్ (44) గత నాలుగేళ్లుగా టీసీఎస్ లో మేనేజర్ గా పని చేస్తున్నాడు. గతంలో ఆయన బంధువులు, స్నేహితులకు అప్పులు ఇచ్చాడు. అవి వసూలు కాకపోవడంతో ఇతరుల వద్ద అప్పులు చేశాడు. ఇచ్చిన అప్పులు వసూలు కాకపోవడం, తీసుకున్న అప్పులు  చెల్లించడం కష్టం కావడంతో గతంలోనే ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు మనోవేదన అనుభవించాడు.

ఎస్ఆర్ నగర్ పరిధిలోని వెంగళరావునగర్ డివిజన్ సిద్ధార్థనగర్లో బాల శ్రీధర్ తన కుటుంబంతో పాటు నివసిస్తున్నాడు. నిన్న ఉదయం ఆయన భార్య పద్మ పిల్లలను తీసుకుని డీమార్ట్ కు వెళ్లింది. అదే సమయంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డీమార్ట్ నుంచి తిరిగి వచ్చిన పద్మకు ఆయన విగత జీవిగా కనిపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.