నాటి 'చిత్రం' సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్న తేజ!

22-02-2021 Mon 16:40
  • ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన 'చిత్రం'
  • హీరోగా ఉదయ్ కిరణ్ పరిచయం
  • దర్శకుడిగా మారిన కెమెరామేన్ తేజ
  • 'చిత్రం 1.1'గా సీక్వెల్ నిర్మాణం  
Teja makes sequel to Chitram movie

దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన 'చిత్రం' సినిమా ఒక సంచలనం. అతితక్కువ బడ్జెట్టులో ఉషాకిరణ్ మూవీసీ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపించింది. సరికొత్త ట్రెండుకి శ్రీకారం చుట్టింది. అప్పటివరకు కెమేరామేన్ గా రాణిస్తున్న తేజ ఈ చిత్రంతో దర్శకుడిగా మారి సత్తా చాటారు. అలాగే ఉదయ్ కిరణ్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమై తదనంతర కాలంలో పలు సినిమాలు చేశాడు. అలాగే హీరోయిన్ రీమాసేన్ కూడా టాలీవుడ్ కి పరిచయమైంది. ఇక ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన ఆర్ఫీ పట్నాయక్ మరెన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించి సంగీత దర్శకుడిగా రాణించారు.

ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ నిర్మిస్తుండడం విశేషం. 'చిత్రం 1.1' పేరుతో దీనిని నిర్మిస్తున్నట్టు పేర్కొంటూ, దర్శకుడు తేజ ఈ రోజు టైటిల్ లోగోతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. తేజ చిత్ర నిర్మాణ సంస్థ చిత్రం మూవీస్, ఎన్ స్టూడియోస్ కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక 'చిత్రం'లోలానే ఇందులో కూడా కొత్త వాళ్లను పరిచయం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి షూటింగును నిర్వహిస్తారు. దీనికి కూడా ఆర్ఫీ పట్నాయక్ సంగీతాన్ని సమకూర్చనున్నారు.