మరో సినిమాను లైన్లో పెట్టిన రవితేజ

22-02-2021 Mon 13:08
  • 'క్రాక్' సినిమాతో రవితేజకు భారీ హిట్ 
  • రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి'
  • త్రినాథరావు చిత్రానికి గ్రీన్ సిగ్నల్  
  • వచ్చే నెల నుంచి షూటింగ్ షురూ
Raviteja starer new film announced

ఇటీవల విడుదలైన 'క్రాక్' సినిమా రవితేజకు మంచి పేరుతెచ్చిపెట్టింది. ఇది బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా.. ఇమేజ్ పరంగా కూడా రవితేజను మరో మెట్టు పైకెక్కించింది. దీంతో తన పారితోషికాన్ని కూడా ఆయన బాగా పెంచేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తాను రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖిలాడి' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతోంది.  

ఇదిలావుంచితే, తాజాగా రవితేజ నటించే మరో చిత్రం ఖరారయింది. 'సినిమా చూపిస్త మావా', 'నేను లోకల్', 'హలో గురూ ప్రేమకోసమే' వంటి చిత్రాల ద్వారా పేరుతెచ్చుకున్న త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఈ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ మేరకు నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు.

వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. రవితేజ శైలి మాస్ ఎంటర్ టైనర్ గా దీనిని రూపొందించనున్నట్టు తెలుస్తోంది.