Britain: ఇక కరోనాతో సహజీవనమే... మరో మార్గం లేదంటున్న బ్రిటన్!

Live With Corona is the Only Way says Britain
  • ఈయూలో అత్యధిక నష్టం బ్రిటన్ కే
  • మ్యూటేషన్ చెందుతున్న కరోనా వైరస్
  • పార్లమెంట్ లో చర్చకు కొత్త రోడ్ మ్యాప్
తమ దేశ ప్రజలకు కరోనా టీకాను అందించడంలో యూరోపియన్ యూనియన్ మొత్తంలో బ్రిటన్ ముందు నిలిచినప్పటికీ, తదుపరి ఏంటన్న ప్రశ్న ప్రధాని బోరిస్ జాన్సన్ పై ఒత్తిడిని పెంచుతోంది. కొవిడ్ ను ఎదుర్కోవడడంలో పాటించాల్సిన విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఇజ్రాయెల్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వేళ, యూకేలో మాత్రం లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం నానా అవస్థలూ పడుతోంది.

ఈ నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్, తన సహచరులతో మాట్లాడుతూ, స్కూళ్లు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, ఉద్యోగ కేంద్రాల్లో భారీ ఎత్తున నమూనాలను సేకరించి, పరీక్షలు జరిపించాలని, కరోనాతో సహజీవనం చేసేలా ప్రజలను సమాయత్తం చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు నేడు జరగనున్న పార్లమెంట్ సమావేశంలో లాక్ డౌన్, వ్యాక్సినేషన్ తదనంతర పరిస్థితులపై రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

నిత్యమూ వేలాదిగా పరీక్షలను నిర్వహించాలని, ముఖ్యంగా సెకండరీ పాఠశాలలకు వచ్చే విద్యార్థులపై దృష్టిని సారించాలని నిర్ణయించామని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి డొమినిక్ రాబ్ తెలిపారు. రోజువారీ జీవితంలో కరోనా కూడా ఓ భాగమై పోయిందని, దాన్ని ఎదుర్కొంటూనే జీవించాల్సి వుందని ఆయన అన్నారు.

కాగా, 1709లో బ్రిటన్ లో సంభవించిన 'గ్రేట్ ఫ్రాస్ట్' తరువాత అత్యధిక మరణాలు కరోనా కారణంగానే సంభవించాయి. లాక్ డౌన్ కారణంగా ఈయూలో అత్యధికంగా నష్టపోయిన దేశాల్లో బ్రిటన్ కూడా ఉంది. ఇదే సమయంలో కరోనా వైరస్ మ్యూటేషన్ చెందుతూ, మరింత వేగంగా వ్యాపించే స్ట్రెయిన్ లుగా మారడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లు కొత్త స్ట్రెయిన్ లను ఏ మేరకు అడ్డుకుంటాయన్న విషయమై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.

ఈ నేపథ్యంలోనే వైరస్ తో కలసి జీవించాలని ప్రజలకు సూచిస్తున్న బోరిస్ ప్రభుత్వం, కొవిడ్ మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటిస్తూ, మహమ్మారిని ఎదుర్కోవాలని చెబుతోంది. ఇంతకుమించి మరో మార్గం లేదని స్పష్టం చేస్తోంది.
Britain
Corona Virus
Road Map
Boris Johnson

More Telugu News