ముగిసిన ఏపీ పంచాయతీ పోరు... ఎవరి లెక్కలు వారివే!

22-02-2021 Mon 09:39
  • నాలుగు విడతలుగా జరిగిన ఎన్నికలు
  • అత్యధిక స్థానాల్లో వైసీపీ మద్దతుదారుల విజయం
  • కుప్పంలో సైతం ఫ్యాన్ గాలి వీచిందన్న వైసీపీ నేతలు
  • జగన్ పై ప్రజా వ్యతిరేకత కనిపించిందన్న టీడీపీ
Gram Panchayat Elctions Closed in AP

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు, గుర్తులకు అతీతంగా జరగడంతో, విజేతలుగా ఏ పార్టీ మద్దతుదారులు నిలిచారన్న విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. అత్యధిక స్థానాల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచారని తెలుస్తున్నా, సంఖ్య విషయంలో మాత్రం అనుమానాలు ఉన్నాయి.

మరోవైపు ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, జగన్ పాలనపై ప్రజల్లోని వ్యతిరేకత వ్యక్తమైందని, తాము చెప్పుకోతగ్గ స్థానాల్లో విజయం సాధించామని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. పలు చోట్ల తమ మద్దతుదారులను ప్రలోభాలకు గురి చేశారని, చాలా చోట్ల బెదిరించి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదే సమయంలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ప్రజలంతా ఏకతాటిపై నిలిచారని, చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో సైతం ఫ్యాన్ గాలి వీచిందని వైసీపీ నేతలు అంటున్నారు.