CM Ramesh: సీఎం రమేశ్ స్వగ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం.. విశాఖలో మాజీ మంత్రి భార్య ఓటమి

BJP Candidate won in CM Ramesh own village
  • పొట్లదుర్తిలో బీజేపీ బలపరిచిన నరసింహులు విజయం
  • వెన్నెలపాలెంలో బండారు మాధవీలత ఓటమి
  • పెందుర్తి ఎమ్మెల్యే భార్య శిరీష గెలుపు
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ స్వగ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్‌గా విజయం సాధించారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని పొట్లదుర్తిలో బీజేపీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేసిన గాదెగూడూరు నరసింహులు విజయం సాధించారు. అలాగే, 14వ వార్డులో కూడా బీజేపీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు.

విశాఖపట్టణం జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీమంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి భార్య బండారు మాధవీలత ఓటమి పాలయ్యారు. టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన ఆమె సమీప ప్రత్యర్థి వెన్నెల అప్పారావు చేతిలో 580 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మాధవీలత గతంలో మూడుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు.

ఇక, అదే జిల్లా పెందుర్తి మండలం రాంపురం పంచాయతీ సర్పంచ్‌గా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ భార్య అన్నం శిరీష విజయం సాధించారు. ప్రత్యర్థిపై 1049 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయాన్ని అందుకున్నారు.
CM Ramesh
Kadapa District
Pendurthi
Bandaru Madhavilatha

More Telugu News