బిగ్ బీ అమితాబ్ ఇంటి వ‌ద్ద భద్ర‌త పెంచిన పోలీసులు!

21-02-2021 Sun 11:55
  • ఇటీవ‌ల‌ అమితాబ్ పై మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తీవ్ర వ్యాఖ్య‌లు
  • ఆయ‌న‌  నిజమైన హీరో కాదన్న నానా పటోలే
  • చ‌మురు ధ‌ర‌ల పెంపుపై స్పందించాల‌ని డిమాండ్
  • లేదంటే షూటింగులు, సినిమాల‌ను అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రిక‌
security increases at big b home

దేశంలో చమురు ధరలు మండిపోతుండడం పట్ల అమితాబ్ బ‌చ్చ‌న్ స‌హా బాలీవుడ్ నటులు స్పందించడం మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే.  అమితాబ్ బచ్చన్  నిజమైన హీరో కాదంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో అమితాబ్‌ బచ్చన్‌ నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు.

తాత్కాలికంగా తీసుకుంటున్న‌ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భ‌ద్ర‌త‌ను పెంచిన‌ట్లు పోలీసులు అంటున్నారు. అయితే, ఎందుకు భద్రత పెంచార‌న్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు. పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడంపై అమితాబ్ వంటి హీరోలు త‌మ తీరు ఏంటో చెప్ప‌క‌పోతే  మహారాష్ట్రలో వారి సినిమాల ప్రదర్శనలతో పాటు షూటింగుల‌కు  అనుమతించబోమని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే చేసిన హెచ్చ‌రిక నేప‌థ్యంలోనే పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. మ‌హారాష్ట్ర‌లోని సంకీర్ణ ప్ర‌భుత్వంలో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉంది.