జ‌య‌ల‌లిత జ‌యంతి సంద‌ర్భంగా 24న శ‌శిక‌ళ కీల‌క స‌మావేశం

21-02-2021 Sun 11:17
  • కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్న శ‌శిక‌ళ‌
  • పార్టీ ప్రముఖులతో శ‌శిక‌ళ ఆ రోజు భేటీ
  • మెరీనాబీచ్‌లోని జయలలిత సమాధి సందర్శన?
sasi kala to meet party leaders

అక్ర‌మాస్తుల కేసులో ఏఐడీఎంకే బ‌హిష్కృత నాయ‌కురాలు వీకే శశికళ ఇటీవ‌లే విడుద‌లైన విష‌యం తెలిసిందే. అయితే, ఆ పార్టీ త‌న‌కే చెందుతుంద‌ని వాదిస్తోన్న ఆమె ఈ నెల 24న పార్టీ ప్రముఖులతో భేటీ కావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ు. ఫిబ్ర‌వ‌రి 24న జ‌య‌ల‌లిత జ‌యంతి నేప‌థ్యంలో ఈ సంద‌ర్భంగానే ఆమె తొలిసారిగా నేతలతో సమావేశం అవుతున్నారు.

ఈనెల 24న జయలలిత జయంతి సందర్భంగా టి. నగర్‌ నివాసగృహంలో ఆమె చిత్రపటానికి  నివాళులర్పిస్తారు. అదే రోజు సాయంత్రం మెరీనాబీచ్‌లోని జయలలిత సమాధి సందర్శనకు వెళ్లే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అంతేగాక‌, ప్రముఖ ఆలయాలకు వెళ్తారు.  

ప్ర‌స్తుతం ఆమె టి.నగర్‌లోని త‌న‌ వదిన ఇళవరసి కుమార్తె కృష్ణప్రియకు చెందిన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. దినకరన్ తో రాజకీయ పరిస్థితులపై ఆమె చర్చలు జరుపుతున్నారు. గ‌తంలో నిర్వ‌హించిన‌ అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం చెల్లదంటూ ఇప్ప‌టికే ఆమె కోర్టులో పిటిష‌న్లు వేశారు. అవి మార్చి 25న విచార‌ణ‌కు రానున్నాయి. దీంతో వాటిపై ఇప్ప‌టికే శశికళ న్యాయనిపుణులతో చర్చలు జరిపారు.