Andhra Pradesh: ఏపీ పంచాయతీ చివరి అంకం మొదలు... ఓటేసిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్!

  • మొదలైన నాలుగో విడత పోలింగ్
  • 48 వేల మందితో భద్రత
  • సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియో షూటింగ్
  • 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు
Final Fase of Panchayat Poll Started in AP

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యంతో పాటు, గతంలో గొడవలు జరిగిన ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించారు. మొత్తం 48 వేల మంది పోలీసులతో పటిష్ఠమైన బందోబస్తు, పోలింగ్ ప్రక్రియను వీడియోను తీస్తున్నారు.

మధ్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా, ఆపై 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆపై వెంటనే ఫలితాలను ఎక్కడికక్కడ విడుదల చేయనున్నారు. మొత్తం 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లలో పోలింగ్ జరుగుతోంది. 3,299 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు నాలుగో విడత నోటిఫికేషన్ వెలువడగా, 554 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయన్న సంగతి తెలిసిందే.

మిగతా స్థానాలకు సంబంధించి 67,75,226 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 28,995 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు, 6,047 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా, మరో 4,967 కేంద్రాలు అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, బందోబస్తును పెంచారు.

ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లకూ ఏపీ ఎస్ఈసీ నుంచి ప్రత్యేక ఆదేశాలు వెళ్లాయి. ఓట్ల లెక్కింపును తప్పనిసరిగా వీడియో తీయాలని నిమ్మగడ్డ ఆదేశించారు. ఓటింగ్ ప్రక్రియలో వెబ్ కాస్టింగ్, వీడియో, సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలని ఎస్ఈసీ ఆదేశించారు.

ఇదిలావుండగా, ఈ ఉదయం నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండల పరిధిలోని మబగం గ్రామంలో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉదయమే పోలింగ్ స్టేషన్ కు వచ్చిన ఆయన తొలి ఓటు వేశారు. ఇదే సమయంలో రాంపురం పోలింగ్ స్టేషన్ లో ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఓటేయగా, పొన్నూరు నియోజకవర్గం పెద్ద కాకాని ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన బూత్ లో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన ఓటేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు పరిధిలోని రాయన్నపాలెంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ చౌదరి ఓటేశారు.

More Telugu News