నన్ను తీసుకెళ్లి పొమ్మని దేవుడిని వేడుకున్నా: నటి సంజన!

21-02-2021 Sun 07:17
  • నా కంట్లో కన్నీరు కూడా ఇంకిపోయింది
  • నా మార్గం చాలా రఫ్ గా ఉందని తెలుసు
  • త్వరలోనే నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటానన్న సంజన
Actress Sanjana Latest Comments

"నేను కొన్ని నెలలుగా ఏడుస్తూనే ఉన్నాను. నా కంట్లో కన్నీరు కూడా ఇంకిపోయిందేమో. నన్ను ఇంతగా కష్టపెట్టే బదులు తీసుకెళ్లి పొమ్మని భగవంతుడిని ప్రార్థించాను" అని శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లి, ఇటీవల బెయిలుపై విడుదలైన నటి సంజనా గల్రానీ వాపోయింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, తాను వెళుతున్న మార్గం చాలా రఫ్ గా ఉంటుందని తనకు తెలిసిందని, దాన్ని దాటేసి, తిరిగి ఎప్పటిలా పైకి ఎగరాలనుందని ఆమె చెప్పింది.

భారత న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించిన సంజన, తనకు లాక్ డౌన్ సమయంలో నిశ్చితార్థం జరిగిందని స్పష్టం చేసింది. లాక్ డౌన్ కారణంగా ఎంగేజ్ మెంట్ ను ప్రకటించలేకపోయానని, ఇప్పుడు వివాహాన్ని కూడా చిన్న వేడుకలా మాత్రమే చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ లో తమ పెళ్లి జరుగుతుందని సంజన వ్యాఖ్యానించింది.