అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే 'ఛలో అసెంబ్లీ' చేపట్టాలని జనసేన నిర్ణయం

20-02-2021 Sat 22:14
  • మార్చి 14 తర్వాత అసెంబ్లీ సమావేశాలు!
  • ప్రభుత్వాన్ని రైతు సమస్యలపై నిలదీయాలని భావిస్తున్న జనసేన
  • ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్న నాదెండ్ల
  • సీఎంకు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యలు
  • నీతి ఆయోగ్ భేటీలో నివర్ నష్టంపై మాట్లాడలేదని ఆరోపణ
Janasena decides to conduct Chalo Assembly on the first day of Assembly Budget Sessions

రైతు సమస్యలపై ఎలుగెత్తాలని పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చే విధంగా భారీ ఎత్తున 'ఛలో అసెంబ్లీ' నిర్వహిస్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే తాము ఛలో అసెంబ్లీ చేపడతామని స్పష్టం చేశారు.

ప్రభుత్వం రైతులను వంచనకు గురిచేస్తోందని, సీఎం జగన్ కు రైతుల సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని నాదెండ్ల విమర్శించారు. సీఎంకే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ్టి నీతి ఆయోగ్ సమావేశంలో నివర్ తుపాను నష్టాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించి, రైతుల సమస్యలపై ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లపై కనీస స్పందన రాలేదని ఆరోపించారు.

ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంటే... సీఎం అయ్యాక జగన్ ఒక్కసారైనా గ్రామాల్లో పర్యటించారా? అని నిలదీశారు. పాదయాత్రలో ఉన్నంత ఓర్పు సీఎం అయ్యాక జగన్ లో కనిపించడం లేదని నాదెండ్ల విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఏపీలో స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని భావిస్తున్నారు. బహుశా మార్చి 14 తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది.