Vijaysai Reddy: ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కానివ్వం: విజ‌య‌సాయిరెడ్డి

Vijayasai Reddy says the wont agree privatisation of Visakha Steel Plant
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వైసీపీ
  • వైజాగ్ లో విజయసాయి పాదయాత్ర
  • ముగింపు సభలో విజయసాయి ప్రసంగం
  • సీఎం జగన్ ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారని వెల్లడి
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాతిక కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

ఈ సభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, అనేక త్యాగాల ఫలితమే విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు అని తెలిపారు. ప్రైవేటీకరణకు తాము పూర్తిగా వ్యతిరేకమని, పరిశ్రమ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతుంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

పోస్కో సంస్థ ప్రతినిధులు సీఎం జగన్ ను కలిస్తే, విశాఖలో తప్ప మరెక్కడైనా ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారని విజయసాయి వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.25 వేల కోట్ల మేర రుణభారం ఉందని, ఆ రుణాలను ఈక్విటీలోకి మార్చడమే కాకుండా, ప్లాంట్ కు సొంతంగా గనులు కేటాయిస్తే మళ్లీ లాభాల బాట పడుతుందని సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారని వెల్లడించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్పత్తి ఆగరాదని, ఉత్పత్తి ఆగితే సంస్థ నష్టాలు మరింత పెరుగుతాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ లో ఉన్న అధికారులు మన రాష్ట్రానికి చెందినవారు కాదని, వాళ్లే కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని విజయసాయి ఆరోపించారు.
Vijaysai Reddy
Visakha Steel Plant
Privatisation
Vizag
Jagan
YSRCP

More Telugu News