వెంకటేశ్ హీరోగా 'దృశ్యం' సీక్వెల్.. అధికారిక ప్రకటన!

20-02-2021 Sat 21:56
  • గతంలో వచ్చిన 'దృశ్యం' పెద్ద హిట్ 
  • మలయాళంలో సీక్వెల్ నిర్మాణం  
  • ఓటీటీలో విడుదల.. మంచి రెస్పాన్స్
  • మార్చ్ నుంచి తెలుగు రీమేక్ షూటింగ్
Venkatesh confirmed in Drushyam sequel

మంచి కథ.. చక్కని స్క్రీన్ ప్లే.. దానిని చక్కగా ప్రెజంట్ చేయగలిగే దర్శకుడు ఉంటే ఒక సినిమా ఎంతగా ఆకట్టుకుంటుందనేది గతంలో వచ్చిన 'దృశ్యం' చిత్రం చాటిచెప్పింది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్, మీనా జంటగా మలయాళంలో వచ్చిన 'దృశ్యం' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో వెంకటేశ్, మీనా జంటగా రీమేక్ చేయగా, ఇక్కడ కూడా ఘన విజయాన్ని సాధించింది.

ఈ చిత్రానికి ఇటీవలే మలయాళంలో సీక్వెల్ రూపొందించారు. తాజాగా దీనిని ఓటీటీలో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని కూడా వెంకటేశ్ తెలుగులో చేస్తారా? అన్న విషయంపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఈ రోజు ఈ చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోనీ పెరంబవూర్ కలసి వెంకటేశ్, సురేశ్ బాబులను కలిశారు. దీంతో చిత్రం రీమేక్ విషయం ఓ కొలిక్కి వచ్చింది.

'దృశ్యం 2'ని తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు నిర్మాత ఆంటోనీ ట్వీట్ చేశారు. మార్చిలో షూటింగ్ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, వెంకటేశ్, సురేశ్ బాబులతో కలసి తాము దిగిన ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. రెండు నెలల్లోనే చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేసేలా ఈ చిత్రం షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట.