తమిళనాడులో రాజకీయ నేతలు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులకు కరోనా వ్యాక్సిన్

20-02-2021 Sat 20:48
  • అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వ్యాక్సినేషన్
  • కేంద్రం అనుమతించిందన్న టీఎస్ ఆరోగ్యశాఖ
  • తొలి దశలో కేవలం 50 శాతం మంది మాత్రమే టీకా తీసుకున్న వైనం
TN to give vaccination to politicians and teachers and journalists

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్ల వయసు పైబడినవారు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులకు వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించిందని ఆ రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. ఎన్నికల సమయంలో విధులు నిర్వహించే వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ముఖ్యమని ఆయన అన్నారు.

తొలి దశ వ్యాక్సినేషన్ లో ఇప్పటి వరకు 50 శాతం మందికి టీకా అందించామని చెప్పారు. రోజుకు 80 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉన్నా... కేవలం 20 వేల మంది మాత్రమే వస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో  పోలిస్తే తమిళనాడులోని వైద్య సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవడానికి సుముఖత చూపడం లేదని చెప్పారు. ఎన్నికల నాటికి వ్యాక్సిన్ పంపిణీని పూర్తి చేస్తే వైరస్ వ్యాప్తిని కొంత మేరకు అరికట్టవచ్చని అన్నారు.