జంక్ ఫుడ్ ఎందుకు?... ఆరోగ్యకర జీవనశైలి అనుసరించండి: యువతకు వెంకయ్యనాయుడు హితవు

20-02-2021 Sat 20:05
  • హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య
  • అసంక్రమిత రుగ్మతలపై ఆందోళన
  • 61 శాతం మంది ఇలాగే మరణిస్తున్నారని వెల్లడి
  • భారతీయ వంటకాలు శ్రేష్టమని సూచన
  • యోగా వంటి వ్యాయామాలు చేయాలని పిలుపు
Venkaiah Naidu suggests healthy food for youth instead of junk food

భారత్ లో జీవనశైలి సంబంధిత రుగ్మతలు అధికమవుతుండడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదులోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

ఇటీవల భారత్ లో అసంక్రమిత వ్యాధుల బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, 61 శాతం మంది హృదయ సంబంధ సమస్యలు, మధుమేహం, క్యాన్సర్ వంటి జబ్బులతో మరణిస్తున్నారని వెల్లడించారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఈ అంశం ఎత్తిచూపుతోందని వెంకయ్యనాయుడు అన్నారు.

భారత సంప్రదాయ వంటకాల్లో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయని, శ్రేష్టమైన ఆహారంతో పాటు యోగా వంటి వ్యాయామాలను కూడా దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించే దిశగా శాస్త్రవేత్తలు ప్రజల్లో అవగాహన కలిగించే చర్యలు తీసుకోవాలని సూచించారు.