మహారాష్ట్రలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. రెండోసారి మహమ్మారి బారిన మంత్రి

20-02-2021 Sat 10:33
  • మూడున్నర నెలల తర్వాత మళ్లీ 6 వేలు దాటిన కేసుల సంఖ్య
  • నిన్న 44 మంది మృతి
  • రాష్ట్రంలో 21 లక్షలకు చేరువైన కరోనా కేసులు
After three months maharashtra registers over 6 thousand cases

దేశంలో అడుగిడిన తొలినాళ్లలో మహారాష్ట్రను వణికించిన కరోనా మహమ్మారి అక్కడ మరోమారు చెలరేగిపోతోంది. మూడున్నర నెలల తర్వాత నిన్న మళ్లీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,112 కేసులు నమోదయ్యాయి. అక్టోబరు 30 తర్వాత 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇక్కడ ఇదే తొలిసారి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

నిన్న నమోదైన కేసుల్లో అకోలా, పూణె, ముంబై డివిజన్‌లలోనే అత్యధికంగా వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,87,632కు చేరినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా, కరోనా కారణంగా నిన్న 44 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుని రాష్ట్రంలో కరోనాకు బలైన వారి సంఖ్య 51,713కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూస్తుండగా అదే సమయంలో రికవరీల సంఖ్య గణనీయంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 44,765గా ఉండగా, నిన్న కరోనా కోరల నుంచి 2,159 మంది మాత్రమే బయటపడ్డారు.

మరోవైపు, గతేడాది సెప్టెంబరులో కరోనా బారినపడి కోలుకున్న మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి బచ్చు కడుతోపాటు ఎన్సీపీ నేత, మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే రెండోసారి కరోనా బారినపడ్డారు. ఖడ్సేకు గతేడాది నవంబరులో కరోనా సోకగా చికిత్స అనంతరం బయటపడ్డారు. తాజాగా తాము రెండోసారి కరోనా వైరస్ బారినపడినట్టు వీరిద్దరూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా, రాష్ట్రంలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయని, వైరస్ వ్యాప్తి మళ్లీ పెరగడానికి అదే కారణమని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.