పవన్ సినిమా కోసం మరో భారీ సెట్

20-02-2021 Sat 10:26
  • క్రిష్ దర్శకత్వంలో పవన్ పిరీడ్ మూవీ 
  • ఇప్పటికే నిర్మాణంలో చార్మినార్ సెట్  
  • తాజాగా రెడీ అయిన సంస్థానం సెట్  
  • త్వరలో పది రోజుల షెడ్యూలు నిర్వహణ 
Another huge set erected for Pawan movie

ఎంచుకున్న కథను బట్టి చిత్ర నిర్మాణవ్యయం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పిరీడ్ మూవీ అయితే భారీ సెట్స్ అవసరమవుతాయి. అందుకోసం కోట్లలో వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓ సినిమా విషయంలో అదే జరుగుతోంది.

క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. వందల ఏళ్ల క్రితం నాటి వాతావరణంలో సాగే కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ వజ్రాలదొంగగా కనిపిస్తాడని అంటున్నారు. ఇక ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేయవలసి వస్తోంది.

ఇప్పటికే హైదరాబాదు శివారులో భారీ స్థలంలో చార్మినార్ సెట్ ను నిర్మిస్తున్నారు. తాజాగా మరో భారీ సెట్ నిర్మాణం కూడా పూర్తయింది. కథ ప్రకారం గండికోట సంస్థానం నేపథ్యంలో  కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందట. అందుకోసం భారీ సంస్థానం సెట్ ను తాజాగా రూపొందించారు. 17వ శతాబ్దం కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా దీనిని సిద్ధం చేసినట్టు సమాచారం. త్వరలో ఈ సెట్లో పది రోజుల పాటు ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటిస్తున్నారు.