తెలంగాణలో కొత్త రథాన్ని ఆలయానికి తీసుకెళుతుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి మృతి

20-02-2021 Sat 08:01
  • నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో ఘటన
  • ఆలయానికి ఇనుప రథం చేయించిన భక్తులు
  • చికిత్స పొందుతున్న మరో 12 మంది  
Chariot get electrocuted two dead

కొత్తగా చేయించిన రథాన్ని ఆలయానికి తీసుకెళుతున్న సమయంలో విద్యుదాఘాతం కారణంగా ఇద్దరు మరణించిన ఘటన తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో జరిగింది. జిల్లాలోని దామరగిద్ద మండలం బాపన్‌పల్లి సమీపంలోని గుట్టపైనున్న వెంకటరమణ ఆలయానికి దాతలు, గ్రామస్థులు కలిసి కొత్త రథాన్ని చేయించారు.

నిన్న రథసప్తమిని పురస్కరించుకుని రథాన్ని అలంకరించి 21 మంది భక్తులు రథాన్ని లాగుకుంటూ ఊరేగింపుగా బయలుదేరారు. అయితే, ఆలయ సమీపంలో గుట్టకింద ఉన్న విద్యుత్ తీగలు రథానికి తాకాయి. అది ఇనుముతో చేసిన రథం కావడంతో వెంటనే రథం మొత్తానికి విద్యుత్ ప్రసరించింది.

దీంతో గ్రామానికి చెందిన సంజనోళ్ల చంద్రప్ప (35), దిడ్డిముంతల హన్మంతు (35) విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.