కేసీఆర్ మాటలే వామనరావు దంపతుల హత్యకు ప్రేరణ అయ్యాయి: భట్టి విక్రమార్క

19-02-2021 Fri 21:01
  • తొక్కేస్తాం, నలిపేస్తాం అని కేసీఆర్ అంటున్నారు
  • ఆయన మాటలే హత్యలు చేసే సంస్కృతికి కారణమవుతున్నాయి
  • కేసీఆర్ మాటలు చిల్లరగా ఉంటున్నాయి
KCRs words are inspiration to the murder of the Vamana Rao couple

నాగార్జునసాగర్ లో కేసీఆర్ మాట్లాడుతూ తొక్కేస్తాం, నలిపేస్తాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని... ఆయన మాట్లాడిన మాటలే మంథనిలో వామనరావు దంపతుల హత్యకు ప్రేరణ అయ్యాయని సీఎల్సీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కేసీఆర్ మాటలే హత్యలు చేసే సంస్కృతికి కారణమవుతున్నాయని దుయ్యబట్టారు.

కోదాడ నియోజకవర్గం మునగాలలో రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతు పలకడం ద్వారా... అంబానీ, అదానీలకు లక్షల టన్నులు నిల్వ చేసుకునే గోదాములను నిర్మించుకునే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారని విమర్శించారు.

కేసీఆర్ మాయ మాటలను ప్రజలు నమ్మే రోజులు పోయాయని భట్టివిక్రమార్క అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బంగాళాఖాతంలోకి విసిరేసైనా సరే రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటామని చెప్పారు. దిండి ప్రాజెక్టుకు నీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పకుండా... కాల్వలు తవ్వుతూ డబ్బు దండుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాటలు చాలా చిల్లరగా ఉంటున్నాయని... తాము కూడా కేసీఆర్ మాదిరి మాట్లాడగలమని, కానీ తమకు సభ్యత, సంస్కారం ఉన్నాయని చెప్పారు.