పితృసమానులు విశ్వనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు: చిరంజీవి

19-02-2021 Fri 18:38
  • ఆయన తీసిన ప్రతి చిత్రం ఒక ఆణిముత్యం
  • ఆయన సినిమాలు తెలుగువారికి చిరస్మరణీయం
  • ఆయన కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
Chiranjeevi greets K Vishwanath on his birthday

కళాతపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత కె.విశ్వనాథ్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. విశ్వనాథ్ తో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో సాన్నిహిత్యం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఈ సందర్భంగా తాను గురువుగా భావించే విశ్వనాథ్ కు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.

గురుతుల్యులు, పితృ సమానులు, మహోన్నత దర్శకులు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన కళాతపస్వి విశ్వనాథ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయన తీసిన ప్రతి చిత్రం ఒక ఆణిముత్యమని, తెలుగువారికి చిరస్మరణీయమని ఈ సందర్భంగా చిరంజీవి కొనియాడారు. విశ్వానాథ్ గారు ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.