టీస్టాల్ వద్ద ఇద్దరు పోలీసులను కాల్చి చంపిన టెర్రరిస్టు

19-02-2021 Fri 16:13
  • జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో దారుణం
  • పోలీసులపై కాల్పులు జరిపి పరారైన ఉగ్రవాది
  • మూడు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన
2 Cops Shot Dead By Terrorists At Srinagar Tea Stall

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్లో ఓ టెర్రరిస్టు ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానిక బఘాట్ ప్రాంతంలోని టీస్టాల్ వద్ద అందరూ చూస్తుండగానే పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. దుస్తుల్లో తుపాకీ దాచుకుని వచ్చిన ముష్కరుడు.. కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది.  

ఈ కాల్పుల్లో సొహైల్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా... మహ్మద్ యూసుఫ్ అనే మరో కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. విమానాశ్రయం రోడ్డులో ఉండే బఘాల్ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాది కాల్పులకు తెగబడటం కలకలం రేపింది.

కాల్పుల ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. టెర్రరిస్టు కోసం ముమ్మర గాలింపును చేపట్టాయి. మూడు రోజుల వ్యవధిలో కాల్పులు జరగడం ఇది రెండోసారి. గత బుధవారం నాడు దుర్గనాగ్ ప్రాంతంలో ఓ రెస్టారెంట్ యజమాని కుమారుడిపై కాల్పులు జరపగా... గాయాలతో అతను బయటపడ్డారు.